ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంటే ఏంటి.. కవితకు సంబంధమేంటి?

ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంటే ఏంటి.. కవితకు సంబంధమేంటి?

ఢిల్లీ లిక్కర్ స్కామ్.. దాదాపు ఏడాదికి పైగా దీనిపై విచారణ కొనసాగుతోంది. ఇప్పుడు ఏకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టుతో మరోసారి లిక్కర్ స్కామ్ పై పెద్ద చర్చ జరుగుతోంది. అసలు లిక్కర్ స్కామ్ అంటే ఏమిటి.. ఈ స్కామ్ కు కవితకు సంబంధమేంటి?

ఢిల్లీలో గతంలో 60 శాతం మద్యం షాపులు ప్రభుత్వ ఆధ్వర్యంలో.. 40 శాతం ప్రైవేటు వ్యక్తుల ఆధ్వర్యంలో నడిచేవి. అయితే వీటిని పూర్తిగా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని 2020లో కేజ్రీవాల్ సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు 2021లో జనవరి 5న కొత్త లిక్కర్ పాలసీ కోసం మంత్రుల బృందంతో కూడిన ఒక కమిటీ వేసింది ఢిల్లీ ప్రభుత్వం. ఈ బృందంలో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్, కైలాష్ గెహ్లాట్ లు ఉన్నారు. ఈ కమిటీ ఏర్పాటైన రెండు నెలల తర్వాత ఒక రిపోర్ట్ ఇచ్చింది. 2021 మార్చిలో మంత్రుల కమిటీ సిఫార్సుకి ఢిల్లీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో ఢిల్లీలో మద్యం అమ్మకాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని అప్పటి ఢిల్లీ ప్రభుత్వం వేసిన కమిటీ సిఫార్సు చేసింది. ప్రైవేట్ వ్యక్తులకు మద్యం షాపులు అప్పగించడం వల్ల ప్రభుత్వ ఆదాయం 9వేల 500 కోట్లు పెరుగుతుందని కేజ్రీవాల్ సర్కార్ ప్రకటించింది.

  • కొత్త లిక్కర్ పాలసీకి కేబినెట్ ఆమోదం

ఆ తర్వాత ఎలాంటి సవరణలు చేయకుండానే 2021 మే 21న కొత్త లిక్కర్ పాలసీని ప్రభుత్వం ఆమోదించింది. అయితే 2021 నవంబర్ నెలలో ఈ కొత్త లిక్కర్ పాలసీని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం తెలపడంతో.. అదే ఏడాది ఈ పాలసీని అమల్లోకి తీసుకొచ్చారు. దీంతో ఢిల్లీ ప్రభుత్వం టెండర్లు వేసి ప్రైవేటు వ్యక్తులకు మద్యం దుకాణాలను అప్పగించింది. ఇందుకోసం లైసెన్స్ ఫీజు భారీగా వసూలు చేసింది. కొత్త లిక్కర్ పాలసీ రాకముందు కాంట్రాక్టర్లు లైసెన్స్ కోసం 25 లక్షల రూపాయలు చెల్లించేవారు. అయితే ఈ పాలసీ వచ్చాక ఎల్-1 లైసెన్స్ కోసం 5 కోట్లు చెల్లించారన్న వాదనలు ఉన్నాయి. అలానే ఇతర కేటగిరీల్లో కూడా లైసెన్స్ ఫీజులను భారీగా పెంచడంతో.. కేవలం పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు మాత్రమే లైసెన్సులు దక్కాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో కాంట్రాక్టర్లు ఇష్టమొచ్చిన రేట్లకు మద్యం అమ్మకాలు జరిపేవారు.

  • లిక్కర్ పాలసీపై ఈడీ, సీబీఐ దర్యాప్తు

అయితే 2022లో ఏప్రిల్ లో ఢిల్లీ చీఫ్ సెక్రటరీగా నరేష్ కుమార్ నియమితులయ్యారు. ఆయన వచ్చిన తర్వాత కొత్త లిక్కర్ పాలసీ మీద ఫోకస్ చేశారు. ఇందులో అవకతవకలు జరిగాయని గుర్తించారు. లిక్కర్ పాలసీ విధానంలోనే కాకుండా.. మద్యం దుకాణాల కేటాయింపులో కూడా తప్పులు జరిగాయని నరేష్ కుమార్ గుర్తించారు.దీని మీద ఒక నివేదిక రెడీ చేసి లెఫ్టినెంట్ గవర్నర్ కు అందించారు. ఈయన కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శి అజయ్ భల్లాకు ఒక లేఖ రాశారు. దీంతో 2022 జూలై 22న కేంద్ర హోమ్ శాఖ సీబీఐ దర్యాప్తుకి ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో ఢిల్లీ ప్రభుత్వం కొత్త లిక్కర్ పాలసీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. తాము అనుకున్నంతగా ప్రభుత్వానికి ఆదాయం పెరగడం లేదని తెలిపింది. అయితే ప్రైవేటు వ్యక్తుల దగ్గర లంచాలు తీసుకుని మద్యం దుకాణాల లైసెన్సులు ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి. ఢిల్లీ ఉపముఖ్యమంత్రి సిసోడియా ..ప్రభుత్వానికి 145 కోట్ల రూపాయల నష్టం చేకూర్చారని.. ప్రతీ బీర్ కేసుకి ప్రభుత్వానికి రావలసిన దిగుమతి సుంకాన్ని ప్రభుత్వం మాఫీ చేసిందన్న ఆరోపణలు వచ్చాయి.

మద్యం వ్యాపారులు, లైసెన్స్ ఫీజు రూపంలో ప్రభుత్వానికి కట్టాల్సిన 145 కోట్ల రూపాయలను కోవిడ్ పేరుతో ఢిల్లీ ప్రభుత్వం మాఫీ చేసిందన్న ఆరోపణలు వచ్చాయి. కేవలం కొందరు ప్రైవేటు వ్యక్తులకు లాభం చేకూరేలా ఈ కొత్త లిక్కర్ పాలసీని ఆప్ సర్కార్ తీసుకొచ్చిందని.. సౌత్ గ్రూప్ పేరుతో దక్షిణాదికి చెందిన కొందరు సిండికేట్ గా ఏర్పడి కొత్త లిక్కర్ పాలసీ ద్వారా లబ్ధి పొందారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇందుకోసం ఆ వ్యక్తులు ప్రభుత్వానికి లంచాలు ఇచ్చారని సమాచారం. ఈ కొత్త పాలసీ నిబంధనలకు విరుద్ధంగా ఉందని.. అవకతవకలు జరిగాయని 15 మంది వ్యక్తులపై ఆగస్టు 2022లో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ తర్వాత పీఎంఎల్ఏ కింద మనీ లాండరింగ్ కేసులో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. కొత్త మద్యం పాలసీకి సంబంధించి సీబీఐ, ఈడీలు రెండూ వేర్వేరుగా దర్యాప్తు చేస్తున్నాయి. పాలసీ విధాన రూపకల్పనలో అవకతవకలు జరిగాయని సీబీఐ, పాలసీ విధాన రూపకల్పన, అమలులో మనీలాండరింగ్ జరిగిందని ఈడీ దర్యాప్తులు చేస్తున్నాయి. దర్యాప్తులో భాగంగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

  • కవిత పాత్రపై అనుమానాలు

హైదరాబాద్ కు చెందిన ప్రముఖ లిక్కర్ బిజినెస్ మేన్, రాబిన్ డిస్టిలరీస్‌ పేరుతో వ్యాపారం చేసిన అరుణ్ రామచంద్ర పిళ్లై, అరబిందో ఫార్మా వ్యవస్థాపకుడు శరత్ చంద్రారెడ్డి వంటి వారితో కూడిన సౌత్ గ్రూప్ ఒకటి ఈ లిక్కర్‌ స్కాంలో అవినీతికి పాల్పడిందన్న ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో కీలకపాత్ర పిళ్ళైదని సీబీఐ వెల్లడించింది.

అంతేకాదు.. తాను బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రతినిధినని,ఆమె తరపున సౌత్ గ్రూప్ కి ప్రాతినిధ్యం వహించానని అరుణ్ రామచంద్ర పిళ్ళై ఈడీ విచారణలో అంగీకరించినట్లు సమాచారం. అదే సమయంలో ఈ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత పాత్ర ఉందని ఢిల్లీ బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సిర్సా ఆరోపించారు. కొత్త లిక్కర్ పాలసీ రూపకల్పనలో కవిత ప్రమేయం ఉందని.. కొత్త పాలసీకి సంబంధించిన చర్చల్లో ఆమె పాల్గొన్నారని వారు అన్నారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఎక్సైజ్ అధికారులు, కేసీఆర్ కుటుంబ సభ్యుల మధ్య హోటల్ లో డీల్ కుదిరిందని ఆరోపణలు వచ్చాయి. లిక్కర్ మాఫియా కమిషన్ ను పది శాతం పెంచేందుకు 150 కోట్ల డీల్ చేసుకున్నారని.. ఢిల్లీలో వ్యాపారం చేయడం కోసం అరుణ్ రామచంద్ర పిళ్ళైని కవితనే తీసుకువచ్చారని తీవ్ర ఆరోపణలు చేశారు. కవిత కోసం ఢిల్లీలో ఒబెరాయ్ హోటల్ లో పిళ్ళై ఆరు నెలలు ఒక గదిని బుక్ చేసి ఉంచారని వారు అన్నారు. ఈ 150 కోట్ల డీల్ లో మొదటి విడత మొత్తం కవిత ద్వారా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియాకు అందాయని ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను బేస్ చేసుకుని దర్యాప్తు చేసిన ఈడీ తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని కవితను అరెస్టు చేసింది.

 

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *