ఆ అలవాటే నన్ను సక్సెస్ వైపు నడిపింది..

ఆ అలవాటే నన్ను సక్సెస్ వైపు నడిపింది..

తలరాత అనేది ఎప్పుడు ఎవరిని ఎలా మారుస్తుందో తెలియదు. సరిగ్గా చెప్పాలంటే ఈ మాట సినీ ఇండస్ట్రీ వాళ్లకి కరెక్ట్ గా సెట్ అవుతుంది. ఏదైనా సినిమా హిట్ అయితేనే అందులో నటించిన హీరోతో పాటు అందరికి గుర్తింపు వస్తుంది. కాని.. ఒక్కోసారి లక్ కూడా కలిసిరావాలి. ఇదంతా ఎందుకంటే సినిమాల్లో హీరోలతో పాటు విలన్లకు కూడా ప్రేక్షకుల్లో అంతే క్రేజ్ ఉంటుంది. ఒక్క సారి విలన్ పాత్రలో నటించి మెప్పించారు అంటే.. వరుస పెట్టి ఆఫర్లు వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు ఎవరైనా నచ్చారంటే.. వాళ్లని గుండెల్లో పెట్టేసుకుంటారు.

తెలుగు, తమిళ చిత్రాల్లో విలన్‌గా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ముఖేష్‌ రిషి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 1999లో ఆమిర్‌ ఖాన్‌ నటించిన సర్ఫరోష్‌ బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో ముఖేష్‌ రిషి ఇన్‌స్పెక్టర్‌ సలీమ్‌ అహ్మద్‌ పాత్రలో నటించి మెప్పించారు. తర్వాత వరుస అవకాశాలు వస్తాయని భావించినా.. ఎవరూ పట్టించుకోలేదు. ఈ క్రమంలో దక్షిణాది చిత్రాల్లో విలన్ గా నటించి వరుస అవకాశాలు అందుకున్నారు.

సర్ఫరోష్‌ తర్వాత బాలీవుడ్‌లో అవకాశాలు వెల్లువలా వచ్చి పడతాయన్న ఆయనకు నిరాశ ఎదురైంది. కాని.. అవకాశాలు వాటంతట అవే వస్తాయని కూర్చోకుండా తన వంతు ప్రయత్నం చేస్తూనే ఉండేవారట. అంతేకాదు.. షూటింగుల విషయంలో ఆయన కచ్చితంగా సమయం పాటించేవారట. అదే తనను సక్సెస్‌ వైపు నడిపించిందని ముఖేష్ రిషి పలు సందర్భాల్లో చెప్పారు. తనకన్నా ముందు విలన్‌ పాత్రల్లో రాణించిన వాళ్లలో కొందరు సమయపాలన పాటించేవారు కాదని అందరూ అనేవారట. కానీ, తాను పెట్టుకున్న నియమాలే తనకు కలిసివచ్చాయన్నారు ముఖేష్ రిషి.

ఆమిర్‌ ఖాన్‌ నటించిన ‘లగాన్‌’లోనూ దేవ్‌ పాత్రకు తొలుత ముఖేష్‌ను అనుకున్నారు. కానీ, ఆ పాత్రను ప్రదీప్‌సింగ్‌ రావత్‌ చేశారు. దక్షిణాదిలో ఎక్కువ అవకాశాలు రావడం వల్ల.. ఒకే సినిమాకి నెలలు తరబడి డేట్స్ కుదరక పోవడంతో.. ఆయన లగాన్ చిత్రం నుంచి తప్పుకున్నారు. ఇక 1994లో వచ్చిన బాలకృష్ణ గాండీవంతో తెలుగు తెరకు పరిచయమైనా ఆరేళ్ల పాటు మళ్లీ ఇక్కడ నటించలేదు. 2000లో జగపతిబాబు మనోహరంతో మళ్లీ రీఎంట్రీ ఇచ్చారు. నరసింహ నాయుడు, ఇంద్ర, ఒక్కడు, సింహాద్రి, జల్సా ఇలా వరుస సినిమాల్లో నటించి మెప్పించారు.

 

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *