సీతక్క లైఫ్ జర్నీ

సీతక్క లైఫ్ జర్నీ

అనసూయ అలియాస్ సీతక్క తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

సాధారణ మహిళ లేదా రాజకీయ వారసత్వం అందుకున్న మహిళ అయితే అందులో ప్రత్యేకత ఏమీ లేదు. కానీ మావోయిస్టుగా ఉండి తర్వాత జనజీవన స్రవంతిలో కలిసి ఎమ్మెల్యేగా ఎన్నికై ఆ తర్వాత మంత్రి కావడం అంటే అంత ఆషామాషీ కాదు. ఆదివాసీ కోయ జాతికి చెందిన దనసరి అనసూయ అలియాస్ సీతక్క అంటే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారే లేరని చెప్పొచ్చు. ఆమె జీవితం ఎందరికో ఆదర్శంగా అయ్యింది. మొన్నటి వరకు అసెంబ్లీలోనే అడుగుపెట్టిన ఈ ఐరన్ లేడీ ఇఫ్పుడు మంత్రిగా ప్రమాణం స్వీకారం చేశారు.

కరోనా సమయంలో తన సేవలతో రాష్ట్ర వ్యాప్తంగా మంచి గుర్తింపు పొందిన సీతక్క.. ఇప్పుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సీతక్క అసలు పేరు అనసూయ దనసరి. సీతక్కగా పరిచయమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆమెకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలుసుకోవాలంటే.. ఆమె మంత్రిగా ప్రమాణం చేసిన వీడియో చూస్తూ చాలు అర్థమైపోతుంది. సభలో సీతక్క పేరు చెప్పగానే 20 సెకన్ల పాటు.. అక్కడున్న అభిమానులు జై సీతక్క అంటూ అరుస్తూ ఆమెపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. నిత్యం పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ.. వారి సమస్యలపై పోరాడుతూ.. నియోజకవర్గాల్లో స్వయంగా పర్యటిస్తూ అభివృద్దికి పాటు పడ్డారు. అందుకే ఆమెను పేద ప్రజల పెన్నిధి అంటారు. ఒక సామాన్య మహిళ ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలందించి.. నేడు ఒక మంత్రి స్థాయికి ఎదిగింది. సీతక్క వరంగల్ జిల్లా ములుగు మండలం.. జగన్నపేట గ్రామంలో ఆదివాసీ కుటుంబంలో జులై 9, 1971 లో జన్మించింది. తండ్రి సమ్మయ్య, తల్లి సమ్మక్క దంపతులకు ఆమె రెండో సంతానం. సీతక్క ములుగు జిల్లాలోని ప్రభుత్వ హాస్టల్ లో ఉంటూ.. పదవ తరగతి వరకు చదువుకున్నారు. చిన్ననాటి నుంచే ఆదివాసీలకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించడం మొదలు పెట్టారు.

తెలంగాణ కాంగ్రెస్ లో మహిళా ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు ములుగు ఎమ్మెల్యే సీతక్క. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఆమె ఒక సెంటిమెంట్ గా మారారు అనడంలో అతిశయోక్తి లేదు. విద్యార్థి దశ నుంచే పోరాట జీవితం మొదలు పెట్టిన ఆమె.. జననాట్య మండలి ద్వారా గద్దర్, విమలక్క లాంటి వారితో… గ్రామాల్లో తిరుగుతూ ప్రజలను చైతన్యవంతులను చేస్తూ వచ్చారు. గిరిజనులపై అటవీ అధికారుల దాష్టికం, ఆదివాసీలపై రాజకీయ నాయకులు.. వారికి సహకరిస్తూ పోలీసులు చేస్తున్న దౌర్జన్యాలపై సీతక్క కన్నెర్ర చేశారు. భూస్వాములు, రాజకీయ నేతలు, వారికి తొత్తులుగా మారిన పోలీసుల ఆగడాలను ఎదుర్కోవాలంటే… పోరాటం ఒక్కటే మార్గం అని ఆమె 1988లో నక్సల్ పార్టీలో చేరారు. అప్పుడు సీతక్క వయసు 14 ఏళ్లు, పదవ తరగతి చదువుతున్నారు. నక్సల్స్ లో చేరిన తర్వాత ప్రజలకు న్యాయం చేయాలనే తన ఆకాంక్షను నెరవేర్చడం ప్రారంభించారు. అలా అణగారిన ప్రజల్లో చైతన్యం కోసం 15ఏళ్లకు పైగా మావోయిస్టుగా అజ్ఞాతవాసం గడిపారు. తన బావ శ్రీరాముడిని పెళ్లి చేసుకొని.. తన పేరు సీతక్కగా మార్చుకున్నారు. కొడుకు పుట్టిన తర్వాత దళంలో ఉండలేక 1996లో జనజీవన స్రవంతిలోకి కలిసిపోయారు. అప్పట్లో ఆమెకు పోలీస్, రాజకీయ వర్గాల నుంచి ఎంత ఒత్తిడి ఎదురైనా.. ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీలో ఉద్యోగినిగా చేరి చదువును కొనసాగించారు.

నెలవారి జీతం కోసం పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ.. ఎల్ఎల్‌బీ పూర్తి చేశారు సీతక్క. ప్రజాసేవ చేయాలనే ఆమె ఆకాంక్ష రాజకీయాల వైపు దృష్టి మళ్లేలా చేసింది. 2004లో అసెంబ్లీ బరిలో ములుగు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2009లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై ఘన విజయం సాధించి.. తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టారు. అక్కడి నుంచి సీతక్క రాజకీయ ప్రస్థానం మొదలైంది. ఎమ్మెల్యే అయిన తర్వాత సీతక్క పేద ప్రజల కష్టసుఖాల్లో స్వయంగా పాలు పంచుకున్నారు. కరోనా సమయంలో చాలా మంది నేతలు ఇళ్లకే పరిమితం అయ్యారు. కానీ సీతక్క తన ప్రాణాలు లెక్క చేయకుండా.. ప్రభుత్వ సహాయం లేకుండా తన నియోజకవర్గంలోని గ్రామాల్లో తిరుగుతూ అహారం, నిత్యవసర వస్తువులు స్వయంగా అందజేశారు. ఒక ప్రజా ప్రతినిధి అంటే ప్రజల కోసం పని చేయాలని నిరూపించారు. అప్పట్లో ఆమెపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లులు కురిశాయి.

2017లో కాంగ్రెస్ లో చేరిన ఆమె 2019 లో ములుగు ఎమ్మెల్యేగా గెలిచారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ములుగు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా మరోసారి సంచలన విజయం సాధించారు సీతక్క. ఎల్బీ స్టేడియంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ములుగు నియోజకవర్గంలో అభిమానులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఒక సామాన్య మహిళ అయినా కూడా తన చుట్టూ ఉన్న ప్రజల కష్టాలపై స్పందించి.. వారి కోసం చిన్నతనంలో పోరాటం మొదలుపెట్టారు. మావోయిస్టు జీవితం నుంచి లాయర్ గా మారి రాజకీయంలో తనదైన ముద్ర వేసుకొని.. మంత్రి స్థాయికి ఎదిగిన సీతక్క జీవితం ఎంతో మందికి ఆదర్శమవుతోంది.

Related post

మేడారం జాతరకు తరలివస్తున్న భక్తజనం

మేడారం జాతరకు తరలివస్తున్న భక్తజనం

మేడారం సమ్మక్క, సారలమ్మ మహా జాతర వైభవంగా జరుగుతోంది. ఆదివాసీల ఆరాధ్య దైవాలైన వనదేవతలను దర్శించుకుని..
సీఎం రేవంత్ రెడ్డికి ట్వీట్స్ వెల్లువ

సీఎం రేవంత్ రెడ్డికి ట్వీట్స్ వెల్లువ

తెలంగాణ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డికి.. పలువురు రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీల నుంచి విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ట్విట్టర్ వేదికగా.. ప్రధాని మోదీ సహా పలువురు ఆయన ట్వీట్లలో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *