తొలిసారి ఎన్నికైన మహిళా అభ్యర్థులు

తెలంగాణ ప్రజలు ఈసారి మహిళలకు పట్టం కట్టారు. ప్రధాన రాజకీయ పార్టీ నుంచి 33 మంది మహిళలు ఈ ఎన్నికల్లో పోటీ చేయగా.. అందులో 10 మంది మహిళలు భారీ విజయం సాధించారు.

బీజేపీ నుంచి పోటీ చేసిన మహిళలలో ఎవరూ విజయం సాధించనప్పటికీ కాంగ్రెస్ నుంచి అయిదుగురు, బీఆర్ఎస్ నుంచి అయిదుగురు గెలిచారు.ఈ పది మందిలో ఆరుగురికి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉండగా… నలుగురు మాత్రం తొలిసారి అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు. కొల్లాపూర్‌లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన బర్రెలక్క, పెద్దపల్లిలో బీఎస్పీ నుంచి పోటీ చేసిన దాసరి ఉష వంటి కొందరు మహిళా అభ్యర్థులు చర్చలో ఉన్నప్పటికీ విజయం వరకు రాలేకపోయారు. తొలిసారి గెలిచిన నలుగురిలో యశస్విని రెడ్డి, లాస్య నందిత, చిట్టెం పర్ణిక రెడ్డి, మట్టా రాగమయి ఉన్నారు.

పాలకుర్తిలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన 26 ఏళ్ల యశస్విని రెడ్డి.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఎర్రబెల్లి దయాకరరావుపై 47వేల 634 ఓట్ల తేడాతో గెలిచారు. పోలైన ఓట్లలో లక్షా 26వేల 848 ఓట్లను ఆమె సాధించారు. యశస్విని రెడ్డి అత్త ఝాన్సీ రెడ్డి అమెరికాలో వ్యాపార రంగంలో ఉన్నారు. ఈ ఎన్నికలలో ఝాన్సీ రెడ్డి కాంగ్రెస్ టికెట్ ఆశించినా ఆమెకు భారత పౌరసత్వం రాకపోవడంతో.. టికెట్ దక్కలేదు. దీంతో ఆమె కోడలు యశస్విని రెడ్డికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. యశస్విని భర్త రాజమోహన్ రెడ్డి కూడా అమెరికాలోనే ఉంటారు. ఆయనకు కూడా భారత పౌరసత్వం లేదు. ఇక పోతే యశస్విని హైదరాబాద్‌లో బీటెక్ చదువుకున్నారు. పెళ్లైన తర్వాత భర్తతో అమెరికా వెళ్లినప్పటికీ.. మళ్లీ కొన్నాళ్లుగా తెలంగాణలోనే ఉంటున్నారు. ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎర్రబెల్లికి ధీటుగా ఆమె ప్రచారం సాగించారు. చివరికి విజయం సాధించి 26 ఏళ్ల వయస్సులోనే ఆమె.. ఒటమి ఎరుగని ఎర్రబెల్లిపై గెలిచి రికార్డు సృష్టించారు.

సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా.. పోటీ చేసిన 36 ఏళ్ల లాస్య నందిత విజయం సాధించారు. పూర్తిగా అర్బన్ నియోజకవర్గమైన కంటోన్మెంట్‌లో ఆమె తన సమీప ప్రత్యర్థి, బీజేపీ నేత శ్రీగణేశ్‌పై 17వేల 169 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. ఇదే నియోజకవర్గంలో విప్లవ గాయకుడు గద్దర్ కుమార్తె వెన్నెల పోటీ చేశారు. ఆమె మూడో స్థానంలో నిలిచారు. లాస్య నందిత తండ్రి సాయన్న ఇదే నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉంటూ మరణించారు. తండ్రి మరణంతో ఈసారి ఆమె పోటీలో దిగారు. గతంలో జీహెచ్ఎంసీ కార్పొరేటర్‌గా పనిచేసిన అనుభవం ఉన్న లాస్య నందిత.. తొలిసారి అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు.

నారాయణపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన.. 30 ఏళ్ల చిట్టెం పర్ణిక రెడ్డి 7వేల 951 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2016లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఈమె రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. తాత చిట్టెం నర్సిరెడ్డి మక్తల్ నియోజకవర్గంలో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2005లో ఆగస్ట్ 15 రోజున జెండా ఆవిష్కరణ చేసిన తరువాత మావోయిస్టులు జరిపిన కాల్పులలో నర్సిరెడ్డి, ఆయన రెండో కుమారుడు వెంకటేశ్వరరెడ్డి చనిపోయారు. పర్ణిక రెడ్డి తండ్రే వెంకటేశ్వరరెడ్డి. ఇక నర్సిరెడ్డి మరణం తరువాత జరిగిన ఉప ఎన్నికలలో ఆయన పెద్ద కుమారుడు చిట్టెం రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచారు. 2018లోనూ మక్తల్ నుంచి రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచారు. అయితే, ఆ తరువాత ఆయన బీఆర్ఎస్‌లో చేరారు. పర్ణిక రెడ్డికి రామ్మోహన్ రెడ్డి స్వయాన పెద్దనాన్న. ఈ ఎన్నికలలో రామ్మోహన్ రెడ్డి మక్తల్ నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీ చేయగా… పర్ణిక రెడ్డి నారాయణపేటలో కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. రామ్మోహన్ రెడ్డి ఓటమి పాలవగా పర్ణిక విజయం సాధించారు.

Related post

రేవంత్ రాజీనామా చేస్తే.. నేను సీఎం అవుతా: హరీష్ రావు

తెలంగాణలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అసెంబ్లీలో కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలకు కేటీఆర్, హరీష్ రావు కౌంటర్ ఇస్తున్నారు.

రేవంత్ లవ్ స్టోరీ.. ఎన్ని ట్విస్టులో తెలుసా?

రేవంత్ రెడ్డి లవ్ స్టోరీ ఇంటర్మీడియల్ లో ఉన్నప్పుడే మొదలైందట. తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి పేరు సంచలనంగా మారింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ విజయం…

ఓటు కోసం షూటింగ్‭కు మెగా హీరో బ్రేక్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కారణంగా పవర్ స్టార్ రామ్ చరణ్ షూటింగుకు బ్రేక్ ఇచ్చారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు.. మైసూర్ నుంచి ఓ ప్రైవేట్ విమానంలో హైదరాబాద్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *