మేడారం జాతర విశిష్టత

తెలంగాణలో మేడారం జాతర అంటే తెలియని వారుండరు. ఈ జాతర గురించి కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు.

దేశంలో కుంభమేళా తర్వాత అత్యధికంగా ప్రజలు తరలివచ్చే జాతర ఇదే అంటే దీనికి ఎంత విశిష్టత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి రెండేళ్లకోసారి ఈ జాతరను నిర్వహిస్తారు. అయితే.. ఈ జాతరను 2014లో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది. ములుగు జిల్లా కేంద్రం నుండి 44 కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి మండలంలో ఉన్న మారుమూల అటవీ ప్రాంతమైన మేడారంలో దట్టమైన అడవులు , కొండ కోనల మధ్య ఈ చారిత్రాత్మకమైన జాతరను నిర్వహిస్తారు.

సమస్త గిరిజనుల సమారాధ్య దేవతలు, కష్టాలు కడతేర్చే కలియుగ దైవాలుగా , ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆపద్భాందవులుగా.. కేవలం తెలంగాణలోనే గాక దేశంలోనే వనదేవతలుగా సమ్మక్క, సారక్క పూజలు అందుకుంటున్నారు. గిరిజన సాంప్రదాయ పద్ధతుల్లో ఈ జాతరను నిర్వహిస్తారు. ఒక్క తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా.. ఆంధ్రప్రదేశ్ , మహారాష్ట్ర , మధ్య ప్రదేశ్ , ఒడిషా , చత్తీస్గఢ్ , జార్ఖండ్ రాష్ట్రాల నుండి కూడా లక్షల కొద్దీ భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్ మండలంలోని పొలవాసను పాలించే గిరిజన దొర మేడరాజు గోదావరి నది తీరంలోని అటవీ ప్రాంతానికి వేటకు వెళ్లారు. ఆ సమయంలో ఒక పుట్ట వద్ద.. సింహాల మధ్య.. కేరింతలు కొడుతూ ఓ పసిపాప కనిపించింది. కోయదొరలు ఆ పాపను తమ వెంట గూడేనికి తీసుకెళ్లి వారే పెంచుకున్నారు. ఆ పాపకు సమ్మక్క అని పేరు పెట్టుకున్నారు. సమ్మక్క వారికి పుట్ట మీద కనిపించే సమయంలో చుట్టూ పులులూ , సింహాలూ ఆమెకు రక్షణగా నిలవడం చూసి ఆమెని దైవాంశ సంభూతురాలిగా భావించారు. కన్నీరు సైతం ఎండిన కరువులో తమకు తోడుగా నిలిచేందుకు వచ్చిన దేవతగా ఆమెను కొలుచుకునేవారు. సమ్మక్క హస్తవాసి వారి నమ్మకాన్ని నిలబెట్టేంది. ఆమె చేత్తో ఆకుపసరు ఇస్తే ఎలాంటి రోగమైనా ఇట్టే నయమైపోయేదట. సమ్మక్క యుక్తవయస్సుకు వచ్చాక.. అతని మేనల్లుడైన మేడారం పాలకుడు పగిడిద్దరాజుకిచ్చి పెళ్ళి చేశాడు మేడరాజు. ఈ దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే ముగ్గురు సంతానం కలిగారు.

రాజ్య విస్తరణ కాంక్షతో కాకతీయ ప్రభువు మొదటి ప్రతాపరుద్రుడు పొలవాసపై దండెత్తాడు. ఆయన దాడికి తట్టుకోలేక మేడరాజు , మేడారం పారిపోయి అజ్ఞాతవాసం గడుపుతుంటాడు. మేడారాన్ని పాలించే కోయరాజు పగిడిద్దరాజు కాకతీయుల సామంతునిగా ఉంటూ కరువు కాటకాల పరిస్థితుల కారణంగా కప్పం కట్టలేకపోతాడు. కప్పం కట్టకపోవడం, మేడరాజుకు ఆశ్రయం కల్పించడం, కోయ గిరిజనులలో సార్వభౌమునికి వ్యతిరేకంగా విప్లవ భావాలు నూరిపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే కారణంతో.. పగిడిద్దరాజుపై ఆగ్రహం చెందిన ప్రతాపరుద్రుడు.. అతడిని అణచివేయడానికి తన ప్రధానమంత్రి యుగంధరుడితో సహా మాఘ శుద్ధ పౌర్ణమి రోజున మేడారం పై దండెత్తుతాడు. పగిడిద్దరాజు , సమ్మక్క , సారక్క , నాగమ్మ , జంపన్న , గోవింద రాజులు తమ సాయుధ బలగాలతో వేర్వేరు ప్రాంతాల నుంచి గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించి వీరోచితంగా పోరాటం చేస్తారు. కాని సుశిక్షితులైన అపార కాకతీయ సేనల ధాటికి తట్టుకోలేక మేడరాజు, పగిడిద్దరాజు, సారలమ్మ , నాగులమ్మ, గోవింద రాజులు యుద్ధంలో మరణిస్తారు. పరాజయ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక సంపెంగ వాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడతాడు. అప్పటి నుండి సంపెంగవాగు జంపన్న వాగుగా ప్రసిద్ది చెందింది. తమ వారంతా మరణించడంతో సమ్మక్క కాళీ మాతలా విజృంభించి శత్రువులను చీల్చి చెండాడుతుంది. కత్తి చేత పట్టి వీరోచితంగా పోరాడింది. ఐతే ఓ సైనికుడు ఆమెను వెన్నుపోటు పొడవడంతో… రక్తమోడుతూ ఆమె చిలుకల గుట్టవైపు వెళ్లింది. అక్కడ ఓ మలుపు వద్ద అదృశ్యమైన్నట్లు పురాణాలు చెబుతాయి.

గూడెం వాసులకు ఈ విషయం తెలిసి సమ్మక్క కోసం అడవిలో దివిటీతో గాలించారు. గుట్టపై ఉన్న నెమలినార చెట్టు కింద పుట్ట దగ్గర కుంకుమ భరిణలా కనిపించిందట. ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరు వీరుడిలా రాజ్యాన్ని పాలించాలని.. ఇక్కడ రెండు గద్దెలు కట్టి.. రెండేళ్ల కోసారి ఉత్సవం జరిపిస్తే.. వారి కోరికలను నెరవేరుస్తానని ఆకాశవాణి ద్వారా వినిపించిందట. ఆ మాటలను అమ్మ ఆదేశంగా గిరిజనులు భావించారు. ఆ తర్వాత ప్రతాప రుద్రుడు గిరిజనుల కప్పాన్ని రద్దు చేసి.. సమ్మక్కకు భక్తుడిగా మారిపోతాడు. సమ్మక్క కుంకుమ భరిణిలా కనిపించిన చోట గద్దెలను కట్టించి.. రెండేళ్ల కోసారి ఉత్సవాలను నిర్వహించారు. అలా మేడారం జాతర మొదలయిందని పురాణాలు చెబుతున్నాయి. అప్పటి నుంచి ప్రతి రెండేళ్లకు ఓసారి మాఘ శుద్దపౌర్ణమి రోజు చిలుకలగుట్ట నుండి సమ్మక్కను కుంకుమ భరణి రూపంలో తీసుకువచ్చి.. గద్దెలపై ప్రతిష్టించి జాతర జరుపుతారు.

మేడారం జాతర మొత్తం నాలుగు రోజుల పాటు జరుగుతుంది. జాతర మొదటి రోజున కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెకు తీసుకువస్తారు రెండవ రోజున చిలుకల గుట్టలో భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠిస్తారు. దేవతలను గద్దెలపై ప్రతిష్ఠించే సమయంలో భక్తులు పూనకంతో ఊగిపోతారు. మూడవ రోజున అమ్మవార్లు ఇద్దరు గద్దెలపై కొలువు తీరి భక్తులకు దర్శనమిస్తారు. నాలుగవ రోజు సాయంత్రం ఆవాహన పలికి దేవతలను ఇద్దరినీ తిరిగి వన ప్రవేశం చేయిస్తారు. వంశ పారంపర్యంగా వస్తున్న గిరిజనులే పూజార్లు కావడం ఈ జాతర ప్రత్యేకత. తమ కోర్కెలు తీర్చమని భక్తులు అమ్మవార్లకు బంగారంగా పిలిచే బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించుకుంటారు.

Related post

మేడారం జాతరకు తరలివస్తున్న భక్తజనం

మేడారం సమ్మక్క, సారలమ్మ మహా జాతర వైభవంగా జరుగుతోంది. ఆదివాసీల ఆరాధ్య దైవాలైన వనదేవతలను దర్శించుకుని..

సీఎం రేవంత్ రెడ్డికి ట్వీట్స్ వెల్లువ

తెలంగాణ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డికి.. పలువురు రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీల నుంచి విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ట్విట్టర్ వేదికగా.. ప్రధాని మోదీ సహా పలువురు ఆయన ట్వీట్లలో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *